కరోనా మహమ్మారి పై జాతినుద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం

మిత్రులారా, గత రెండు నెలలుగా లక్షలాది మంది సిబ్బంది ఆస్పత్రులలో, విమానాశ్రయాలలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. వారు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఆస్పత్రి సిబ్బంది కావచ్చు, సఫాయి కర్మచారి సోదర సోదరీమణులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, రైల్వే సిబ్బంది, బస్సు, ఆటోరిక్షా లాంటి సేవలకు సంబంధించిన వ్యక్తులు, హోం డెలివరీ చేసే వారు, వీరంతా తమ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, ఇతరుల సేవలో నిమగ్నులై ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు చేసే సేవలు అసాధారణమైనవి. వీళ్లకు కూడా వ్యాధి సోకే ముప్పు పొంచి ఉంది. అయినప్పటికీ వీరు తమ కర్తవ్య నిర్వహణలో రేయింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. పరోపకార పరాయణత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. రక్షకులు. మాకు, కొరోనా మహమ్మారి కి మధ్యలో నిలబడి ఉన్నారు. వీరికి దేశమంతా కృతజ్ఞతలు చెబుతోంది. నా కోరిక ఒక్కటే. మార్చి 22వ తేదీ ఆదివారం నాడు మనం ఇటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు సమర్పించాలి. ఆదివారం సరిగ్గా 5 గంటలకు మనం అందరమూ ఇంటి వాకిటి వద్ద నిలబడి, బాల్కనీలో గాని, లేదా కిటికీల దగ్గర గాని నిల్చొని 5 నిమిషాల పాటు ఇటువంటి వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి. చప్పట్లు కొట్టడం ద్వారా, ప్లేట్లను వాయించడం ద్వారా, లేదా గంట కొట్టడం ద్వారా వీరందరికీ వందనాలు సమర్పించాలి. వీరి మనోబలాన్ని ద్విగుణీకృతం చేయాలి. దేశంలోని స్థానిక ప్రభుత్వాలకు నా మనవి ఒక్కటే. మార్చి 22వ తేదీన సరిగ్గా 5 గంటలకు సైరన్ మోత వినిపించడం తోనే ప్రజలకు ఈ సందేశాన్ని అందించాలి. మన సంస్కారం సేవాహీ పరమో ధర్మః. దీనిని ప్రజలందరికీ తెలియచేయాలి. శ్రద్ధ తో ఈ భావాన్ని అభివ్యక్తం చేయాలి. మిత్రులారా.. ఈ విపత్కర సమయం లో మీరందరూ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అత్యవసర సేవలకు డిమాండ్ పెరిగిపోతోంది. మన ఆస్పత్రులపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. అందువల్ల నా మనవి ఒక్కటే. నియమిత చర్య గా చేసుకునే వైద్య పరీక్షల కోసం వీలైనంత వరకు ఆస్పత్రుల చుట్టూ తిరగడం ఆపివేయాలి. మీకు అత్యవసరమైతే.. మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్లండి. మీ కుటుంబ వైద్యుడి దగ్గరకు వెళ్లవచ్చు. లేదా మీ బంధువులలో ఎవరైనా వైద్యులు ఉంటే.. ఫోన్ చేసి అవసరమైన సలహాలను పొందవచ్చు. మీరు ఏదైనా శస్త్ర చికిత్స చేసుకోవాలనుకుంటే.. ముందుగా తేదీని నిర్ణయించుకుని ఉంటే.. దానిని వాయిదా వేసుకోండి. ఒక నెల రోజుల తరువాత ఆ కార్యక్రమాన్ని పెట్టుకోండి. మిత్రులారా.. కరోనా మహమ్మారి దుష్ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ ను అతలాకుతలం చేసేసింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థికమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఒక ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ అవసరమైన వారందరితో మాట్లాడుతూ.. ప్రతిస్పందనలను స్వీకరిస్తూ పరిస్థితులను అంచనా వేస్తూ వీలైనంత త్వరలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఈ టాస్క్ ఫోర్స్ సముచిత నిర్ణయం తీసుకుంటుంది. వాటిని అమలు చేస్తుంది కూడా. ఈ మహమ్మారి కారణంగా మధ్యతరగతి ప్రజల, పేద ప్రజల ఆర్థికాభివృద్ధి కి విఘాతం కలిగింది. ఈ విపత్కర సమయం లో మన దేశంలోని వ్యాపారవర్గాలకు అత్యధిక ఆదాయమున్న ప్రజలకు మనవి చేసేది ఏమిటంటే అవసరమైతే మీరు ఎవరి నుంచి సేవలు పొందుతున్నారో వారి ఆర్థిక సంక్షేమాన్ని గురించి ఆలోచించండి. ఇటువంటి వారు కొన్ని రోజుల పాటు ఆఫీసు కు రాలేకపోవచ్చు. మీ ఇంటికి రాకపోవచ్చు. ఇలాంటి స్థితి లో వీరి జీతాల లో కోతల ను విధించవద్దు. సంపూర్ణమైన మానవతా దృక్పథంతో స్పందిస్తూ నిర్ణయాలు తీసుకోండి. ఒక సంగతి ని నిరంతరం జ్ఞాపకం పెట్టుకోండి.. వారు కూడా వారి కుటుంబాలను పరిరక్షించుకోవలసి ఉంది. కుటుంబ సభ్యులను కొరోనా బారి నుంచి సంరక్షించుకోవలసి ఉంటుంది. మా దేశ వాసులందరికీ కావలసిన పాలు, తినుబండారాలు, మందులు, జీవితానికి అవసరమైన ఇతర సామగ్రి.. వీటన్నింటి కి ఏ మాత్రం లోటు రాకుండా చూసుకోవాలి. అందువల్ల దేశ ప్రజలందరికీ అనవసరమైన సామగ్రి ని సేకరించే కార్యక్రమాలు చేపట్టవద్దని మనవి చేస్తున్నాం. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మామూలుగానే కొనుక్కోండి. అంతేగాని నిత్యావసర వస్తువులను భయాందోళనలతో కొనేసి దాచిపెట్టకండి. మిత్రులారా.. గత రెండు నెలలుగా 130కోట్ల మంది భారతీయులలో ప్రతి ఒక్క పౌరుడు దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ను తన విపత్తు గా భావించారు. ప్రతిఒక్కరూ తనకు చేతనైనంతగా సేవలందించారు. మున్ముందు కూడా మీరందరూ మీ కర్తవ్యాలను నిర్వహిస్తారని, బాధ్యతలను నెరవేరుస్తారని నా నమ్మకం. ఇటువంటి సమయాలలో కొన్ని ఇబ్బందులు రావడం సహజం. కొన్ని వదంతులు వ్యాపించి వాతావరణమంతా విచిత్రంగా మారిపోవచ్చు. కొన్నిసార్లు పౌరుడి గా మన కోరికలు కొన్ని తీరకపోవచ్చు. ఏది ఏమైనప్పటికి, ఈ విపత్కర సమయం లో దేశ ప్రజలందరూ ఈ కష్టాల మధ్యలోనే దృఢసంకల్పం తో ఇబ్బందులన్నింటిని ఎదుర్కోవాలి. మిత్రులారా.. మనమందరమూ కలసి కరోనా ను ఎదుర్కోవడంలో మన సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. దేశం లో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి.. స్థానిక సంస్థలు కానివ్వండి.. పంచాయతీ లు కావచ్చు.. ప్రజాప్రతినిధులు కావచ్చు.. పౌర సంఘాలు కావచ్చు.. ప్రతి ఒక్కరూ మహమ్మారి ని తరిమి కొట్టడానికి వారి వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ వాతావరణం లో మానవాళి కి విజయం చేకూరాలి. మన దేశం విజయపథం లో మున్ముందుకు సాగాలి. ఇంకా కొద్ది రోజులలో నవరాత్రి పండుగ రానుంది. ఇది శక్తి ఉపాసన కు సంబంధించిన పర్వదినం. భారతదేశం దృఢశక్తి తో ప్రగతిపథం లో ముందంజ వేయాలి. మీకు ఇవే నా శుభాకాంక్షలు. మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు. Courtesy : Press Information Bureau of India

ప్రధాన మంత్రి గారి పిలుపును అందుకొని  మీరు జనతా కర్ఫ్యూ లో పాల్గొంటారా ?

  • అవును  (97%, 32 Votes)
  • చెప్పలేము  (3%, 1 Votes)
  • కాదు  (0%, 0 Votes)

Total Voters: 33

Vote | Polls

Loading ...
 Loading ...