దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ చేసిన ప్ర‌సంగ పాఠం

   దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తున్న  వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, రోగనిథాన నిపుణులు తదితరుల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆస్పత్రుల నిర్వహక సిబ్బంది, ఆంబులెన్స్‌ డ్రైవర్లు, వార్డు బాయ్‌లు, పారిశుధ్య కార్మికులు అత్యంత కఠిన పరిస్థితుల నడుమ ఇతరుల సేవలో మునిగి ఉండటాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మన సమాజాన్ని, మన ప్రాంతాన్ని, వీధులను, బహిరంగ ప్రదేశాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ వైరస్‌ నిర్మూలన కోసం తమవంతు కృషి చేస్తున్న వారందరి గురించీ యోచించండి. అలాగే వైరస్‌ బారినపడే ప్రమాదాన్ని లెక్కచెయ్యకుండా 24 గంటలూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఆస్పత్రులతోపాటు ఆయా ప్రాంతాల నుంచి సమాచారం నివేదిస్తున్న ప్రచురణ, ప్రసార మాధ్యమాల ప్రతినిధులను కూడా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. తమ కుటుంబాల శ్రేయస్సును వారి చేతుల్లోనే పెట్టి, మీ చుట్టూ నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది గురించి ఆలోచించండి. మనందర్నీ రక్షించడానికి వారు రాత్రనకా, పగలనకా విధుల్లోనే ఉంటున్నారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా అనేక సందర్భాల్లో వారు ప్రజల ఆగ్రహావేశాలకూ గురవుతున్నారు. మిత్రులారా!    ప్రపంచ మహమ్మారి కరోనా సృష్టించిన ఈ దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించాయి. దేశ పౌరులు తమ దైనందిన కార్యకలాపాల్లో ఇబ్బందులు పడకూడదన్న తపనతో నిరంతరం శ్రమిస్తున్నాయి. అన్ని నిత్యావసరాల సరఫరా సజావుగా కొనసాగే విధంగా మేం సకల ఏర్పాట్లూ చేశాం. ముఖ్యంగా ఈ సంక్షోభం పేదలను చాలా కష్టాల్లోకి నెట్టిందనే చెప్పాలి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పౌర సంఘాలు, వ్యవస్థలు వారి సమస్యలను కనీస స్థాయికి తగ్గించడానికి కృషిచేస్తున్నాయి. పేదలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అనేకమంది ముందుకొచ్చి చేయి కలుపుతున్నారు. మిత్రులారా!    నీస అవసరాలకు తోడు ప్రాణరక్షక అవసరాలను తీర్చడానికీ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కొత్తరకం ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు దేశంలోని అగ్రశ్రేణి వైద్య, పరిశోధన సంస్థల నిపుణుల సలహాలు-సూచనల మేరకు ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా వైరస్‌ పీడితులకు చికిత్స కోసమేగాక దేశంలో మౌలిక వైద్య సదుపాయాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం 15వేల కోట్ల రూపాయలు కేటాయించింది. దీనివల్ల కరోనా నిర్ధారణ పరీక్షల వసతులు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, ఏకాంత చికిత్స పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు తదితర నిత్యావసర పరికరాలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో వైద్య, పారామెడికల్‌ మానవ వనరుల పెంపు దిశగా పలువురికి వేగంగా శిక్షణ ఇచ్చే ప్రక్రియను కూడా చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణకు అగ్ర ప్రాథమ్యం ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ నేను విజ్ఞప్తి చేశాను. ఈ కీలక సమయంలో ప్రైవేటు రంగం కూడా పౌరులతో భుజం కలిపి పూర్తిస్థాయిలో చేదోడువాదోడుగా నిలవడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సవాలును ఎదుర్కొనడంలో ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి ప్రైవేటు ప్రయోగశాలలు, ఆస్పత్రులు కూడా ముందుకొస్తున్నాయి. అయితే… మిత్రులారా!    టువంటి సంక్షోభ సమయాల్లో మనం కడు జాగ్రత్తగా ఉండాలి సుమా! తెలిసోతెలియకో కొందరు అనేక వదంతులను ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వదంతులు, మూఢ నమ్మకాల విషయంలో మీరంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి మీ శరీరంలో వైరస్‌ సోకిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి తప్ప సొంత చికిత్స చేసుకోరాదు. మీమీద మీరు చేసుకునే మందుల ప్రయోగం వికటించి ప్రాణాపాయానికి దారితీయవచ్చు. మిత్రులారా… ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం, స్థానిక అధికారవర్గాలు ఎప్పటికప్పుడు జారీచేసే ఆదేశాలకు భారత పౌరులలో ప్రతి ఒక్కరూ కట్టుబడతారన్న విశ్వాసం నాకుంది. ఇప్పుడు 21 రోజుల దిగ్బంధం  సుదీర్ఘమైనదే… కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మీతోపాటు మీ కుటుంబ క్షేమం, భద్రతలకు అంతే ప్రాముఖ్యం ఉందన్న వాస్తవం గుర్తించాలని మనవి. ఈ సంక్లిష్ట పరిస్థితిని భారతీయులందరూ విజయవంతంగా అధిగమించగలరన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. మీతోపాటు మీ ప్రియమైన వారందరిని జాగ్రత్తగా చూసుకోండి. జైహింద్‌!