కోవిడ్ -19పై చ‌ర్య‌ల కృషిని పెంచేందుకు ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

ముఖ్య‌మంత్రులు ఇచ్చిన సూచ‌న‌లు, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులను వివ‌రించినందుకు ప్ర‌ధాన‌మంత్రి వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కోవిడ్ -19 వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నిచేయడం అవ‌స‌ర‌మ‌న్నారు. వైర‌స్ హాట్ స్పాట్‌ల‌ను గుర్తించి వైర‌స్ వ్యాప్తిచెంద‌కుండా అలాంటి వారిని వేరు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేశ‌వ్యాప్తంగా శాంతి భద్ర‌త‌ల‌ను కాపాడ‌డం ముఖ్య‌మని చెప్పారు. కోవిడ్ -19 మ‌న విశ్వాసం, నమ్మ‌కంపై దాడి చేసింద‌ని ఇది మ‌న జీవ‌న విధానాన్ని కూడా భ‌య‌పెడుతున్న‌ద‌ని అన్నారు. నాయ‌కులు రాష్ట్రాలు, జిల్లాలు, పట్ట‌ణాలు, బ్లాక్ స్థాయిల‌లోని ఆయా క‌మ్యూనిటీ నాయ‌కులు, సామాజిక సంక్షేమ సంస్థ‌ల‌తో సంబంధాలు ఏర్ప‌రుచుకుని కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటానికి క‌మ్యూనిటీ ఆధారిత ఉమ్మ‌డి విధానాన్ని అనుస‌రించాల‌ని సూచించారు. లాక్‌డౌన్ తొల‌గించిన త‌ర్వాత ప్ర‌జ‌లు తిరిగి త‌మ తమ స్థానాల‌కు వెళ్లేందుకు ఒక ప‌ద్ధ‌తిప్ర‌కారం ఉమ్మ‌డి ఎగ్జిట్ వ్యూహం రూపొందించ‌డం ముఖ్య‌మని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఈ నిష్క్ర‌మ‌ణ వ్యూహానికి సంబంధించి రాష్ట్రాలు ఆలోచ‌న చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. అలాగే కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సామాజిక‌దూరం ప్రాధాన్య‌త‌ను ప్ర‌ధాన‌మంత్రి పున‌రుద్ఘాటించారు. కేంద్ర హోంమంత్రి లాక్ డౌన్‌ను కొన్ని రాష్ట్రాల‌లో మ‌రింత క‌ఠినంగా అమ‌లు జ‌ర‌పాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జిల్లా స్థాయిలో మ‌రింత చురుకుగా అమ‌లు చేయాల్సిన ప్రాధ‌న్య‌త‌ను తెలియ‌జెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి, ఈ స‌మావేశంలో పాల్గొన్న ప్ర‌ముఖుల నుద్దేశించి మాట్లాడుతూ, నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ వ‌ల్ల దేశంలో పెరిగిన కేసుల సంఖ్య గురించి చెప్పారు. వైర‌స్ మ‌రింతగా విస్త‌రిస్తే మెడిక‌ల్ కేసుల‌ను ఎదుర్కొనేందుకు చేయ‌వ‌ల‌సిన ఏర్పాట్ల గురించి తెలిపారు. అలాగే జిల్లాల‌లో నిర్థారిత కేసులు ఎక్కువ‌గా ఉన్న చోట వైర‌స్ వ్యాప్తి గొలుసును తెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రి, ఆరోగ్య మంత్రి .ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, కేబినెట్ సెక్ర‌ట‌రీ, హోంసెక్ర‌ట‌రీ, డిజిఐసిఎంఆర్ లు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రుల‌తోపాటు ఆయా రాష్ట్రాల హోంమంత్రులు, ఆరోగ్య‌శాఖ మంత్రులు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, హోంశాఖ కార్య‌ద‌ర్శులు ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శులు ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు. Courtesy : Press Information Bureau